TIE sustainability summit 2021: పర్యావరణహిత పారిశ్రామికీకరణే లక్ష్యంగా.. టై సమ్మిట్.!

పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధితో పాటు.. పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిన ఆవశ్యకతను టై(TIE- The Indus Entrepreneurs)సదస్సు నొక్కి చెప్పింది. టై- హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్​లో టై సస్టేనబిలిటీ సమ్మిట్(TIE sustainability summit)- 2021ను నిర్వహించింది. భవిష్యత్తు తరాల కోసం పరిశ్రమల వ్యవస్థాపకులు వారి పరిశ్రమల్లో స్థిరత్వం(sustainability) జోడించుకోవాలని శిఖరాగ్ర సదస్సు సూచించింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వర్చువల్ సదస్సులో 50కు పైగా దేశాల నుంచి 40 వేలమంది ప్రతినిధులు, 10 వేల స్టార్టప్​లు, 15 వేల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు.

ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం- సుస్థిరత ప్రధానాశాంలుగా హైదరాబాద్ వేదికగా టై(TIE- The Indus Entrepreneurs) సదస్సు ప్రారంభమైంది. హెచ్ఐసీసీలో జరగుతున్న ఈ సదస్సు సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. మొదటి రోజు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​ రంజన్, పలువురు పారిశ్రామిక వేత్తలు, అంకుర కంపెనీలు, ఇజ్రాయిల్, కోస్టారికా దేశ ప్రతినిధులు హాజరయ్యారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు వారి వారి రంగాల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు టై(TIE- The Indus Entrepreneurs) బృందం పాటుపడుతోంది. ఈసారి టై(TIE) ఆధ్వర్యంలో సమ్మిళిత వృద్ధి అనే అంశంపై గ్లోబల్​గా పారిశ్రామిక వేత్తలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి పర్యావరణ హిత పారిశ్రామికీకరణకు కంకణబద్ధులవుదామని టై ఛాప్టర్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా సస్టేనబిలిటీ, సాంకేతికతో ప్రపంచ దేశాలకు మోడల్​గా ఎదుగుతున్న ఇజ్రాయిల్, కోస్టారికా దేశాల నుంచి ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేసింది. రాష్ట్రంలోనూ రెన్యువబుల్ ఎనర్జీ, టెక్నాలజికల్ ఫార్మింగ్​ను ప్రోత్సహించేందుకు ఇజ్రాయిల్, కోస్టారికా దేశాలతో టై(TIE)- హైదరాబాద్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

తెలంగాణ ఇన్నోవేషన్ల ప్రదర్శన
ఇజ్రాయిల్​లో శక్తి అవసరాలకు 98 శాతం పునరుద్ధరణ చేసే వనరుల నుంచే పొందుతుందని.. సాంకేతికతలో ఇజ్రాయిల్ ప్రపంచానికే రోల్ మోడల్​గా నిలిచిందని.. ఈదేశాల విధానాల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​ రంజన్ పేర్కొన్నారు. తెలంగాణ సైతం హరితహారం, చెరువుల పునరుద్ధరణ వంటి పథకాలతో సస్టేనబిలిటీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తోందని.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఫార్మాసిటీ రూపకల్పనలోనూ పర్యావరణహిత మోడళ్లకే ప్రాధాన్యమిస్తున్నామని జయేశ్​ రంజన్​ తెలిపారు. మంగళవారం జరిగే సదస్సులో సస్టేనబిలిటీ రంగంలో తెలంగాణ ఇన్నోవేషన్లను ప్రముఖంగా ప్రదర్శించనున్నట్లు వివరించారు.
అంకురా​లకు వేదికగా
టై(TIE) హైదరాబాద్ ఆధ్వర్యంలో రూరల్ ఇన్నోవేటర్ ప్రోగ్రాంను ఈ సద్ససులో భాగంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ఆవిష్కర్తలకు మెంటరింగ్, పెట్టుబడి సహాయం, డిజైన్ అండ్ ఆపరేషనల్ సపోర్ట్​ను ఈ కార్యక్రమం ద్వారా అందించనున్నారు. అరకు కాఫీని పారిస్ కప్​ఆఫ్ టీగా మార్చటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని టై(TIE) హైదరాబాద్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. సస్టేనబిలిటీ రంగంలో స్టార్టప్‌లకు గమ్యస్థానంగా హైదరాబాద్​ను నిలపడానికి ఈ శిఖరాగ్ర సదస్సు ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం- సుస్థిరత అనే మూడు స్తంభాలను పరిష్కరించడానికి ఈ సస్టేనబిలిటీ సమ్మిట్ ద్వారా అవగాహన కల్పించాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు

Related Posts